ఏమిటో వెధవ సోది, ఈ తలనొప్పులన్ని ఎప్పుడు ఐపొతాయో ఏమో… ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెంటు ఎన్నింటికి వస్తాడో నాకు టికెట్టు కంఫర్మ్ అయ్యిందీ లేనిదీ ఎప్పుడు చెప్తాడో, అసలే మిగతా షాపింగు పనులేమీ కాలేదు, ఇంకో వారం రోజుల్లో అక్కడ కాలేజిలో రిజిష్టరు అవ్వటానికి వెళ్ళాలి…ప్చ్… ఇంతలో ఎవరో కొంపలంటుకుంటున్నట్టు దబ దబా తలుపు కొడుతున్నారు..
నేనే వేరే వాళ్ళ ఆఫీసులో కూర్చునుంటే దీని తలుపులు కొట్టేదెవరబ్బా..
“కన్నా నిద్ర లేవరా రఘు వచ్చాడు…. అబ్బబ్బా వస్తున్నా, నాన్నా లేవరా ఎవరో తలుపు కొడుతున్నారు ఆ ఆ వస్తున్నా….”
“హు లేచాను ఇప్పుడేంటంటా? ఈ రఘు కి పనీ పాటా లేదు ఎప్పుడూ పొద్దున్నే వస్తాడు, ఐతె ఆ ట్రావెలేజెంటు ఆఫీసు అదంతా కలా… ఏంటో మరీ కలలెక్కువవుతున్నాయి ఈ మధ్య”
“అవున్రా ఎక్కువవ్వకేంచేస్తాయి, దున్నపోతులా అన్నన్ని గంటలు నిద్రపోతుంటే??”
ఓహ్ ఆ అనేది పైకే అన్నానా…. వీడి చెవిన పడటం ఆలశ్యం మా రఘు నాకు సెటైరు వెయ్యటానికి ముందుంటాడు..
“రేయ్ లెగు…”…
“ఎక్ష్క్యుజ్ మీ సార్, సార్..”
“హా… వాట్…”
“యువర్ లంచ్ సార్” అని ఒక ట్రే నా ముందు పెట్టి వెళ్ళింది ఆ అమ్మాయి
ఏమి జరుగుతోందో అర్ధం కావటానికి ఒక్క నిమిషం పట్టింది నాకు, నేను ఉన్నాది ఫ్లైట్ లో అనీ, కలలో ఇంకో కలకన్నానా అని మనసులోనే నవ్వుకున్నాను. నిజమే మా రఘు అన్నట్లు ఎక్కువగా నిద్రపోతే ఇలా కలలే వస్తాయి, ఆమెరికాకి బయల్దేరి దాదాపు 24 గంటలు దాటింది, ఇంకొన్ని గంటల్లో హ్యుస్టన్ చేరుకుంటాము అని పైలట్ ఎనవ్న్సు చేస్తున్నాడు…
ఫై చదువులకని అందరినీ వదిలి అమెరికాకి వెళ్ళి ఒక సంవత్సరం అయ్యింది, ఇన్నాళ్టికి అన్నీ కుదిరి శెలవులకి ఇంటికి (హైదరాబాదుకి) వెళ్ళి వస్తున్నాను శెలవులంటే ఎన్నో రోజులు కూడా కాదు, రెండు వారాలు అంతే, సంవత్సరకాలంగా పేరుకున్న ఆప్యాయతలు, మిస్ అయిన పండుగలు, చుట్టాల విశేషాలు, స్వయంగా కాక ఫోనుల ద్వారా పంచుకున్న ఆనందాలు, దుహ్ఖాలు, ముఖ్యంగా అమ్మవొడి, “పండూ” అని పిలిచే నాన్న పిలుపు, “చిన్నా అది తినరా ఇది తినరా” అంటూ గోల చేసే మామ్మ, యే చిన్న విషయం జరిగినా నేను వెంటనే చెప్పుకునే రఘు, వీళ్ళందర్నీ తనివితీరా చూడటానికి, అన్నీ పంచుకోటానికి ఉన్నది రెండు వారాలు, రెండు వారాలు అయిపొయాక ఇవాళ రాత్రి విమాణం ఎక్కాలి అనుకుంటుండగా…
“ అమ్మా నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను నాన్న” అని బుంగ మూతి పెట్టాను, నన్ను చూసి అమ్మ కూడా బాధపడింది… ఒక్కగానొక్క కొడుకునికనుక ఇద్దరూ నన్ను చాల గారాభంగా పెంచారు, సామాన్యంగా అబ్బాయిలకి నాన్నలంటే ఉండే భయం మా నాన్న దగ్గర లేదు, ఇంకా వెరైటీగా ఆయన దగ్గరే ఇంకా గారాభం ఎక్కువ పోతాను.
మొదటి సారి అమెరికా కి ప్రయాణం చేస్తున్నప్పుడు, “అక్కడికి వెళ్ళాక ఏమి ఎదురవుతుందో, ఎలా ఉంటానో, కొత్త వ్యక్తులూ, కొత్త స్నేహాలు…. అని నన్ను ఎదురుచూస్తున్నాయి.. ఏదేమైన ధైర్యంగ ఉండాలి ఇంకా ఎల్లకాలం చిన్నపిల్లాడిలా అమ్మానాన్నల దగ్గర ఉండలేం కదా” అని నన్ను నేను సముదాయించుకున్నాను, ఈ సారి అలా ఉండదనుకున్నాను, కాని ఈ సారే మరె బెంగగా ఉంది పట్టుమని నెలరోజులు కూడా లేనాయె ఇంట్లొ, అమ్మ చేత వండించుకుని తినాలి అనుకున్న పెద్ద లిస్టు సగం కూడా కాలేదు, రఘుతో గడిపింది ఒకటిన్నర రోజు, ఏమిటొ మరీ బెంగగా ఉంది ఈసారి.
రఘు నాకున్న ఒక్కగానొక్క బెస్టు ఫ్రెండు, వాడికి నేనూ అంతే …. మా ఇద్దరి అభిరుచులు, పద్దతులు ఒక్కటే అని చెప్పాలి, మా ఇద్దరి మాట తీరు, గొంతూ ఎంత సమానంగ ఉంటాయంటే ఒకోసారి మా అమ్మానాన్నలు కూడా తడబడతారు ఫోనులో, అంతెందుకూ, నేను, వాడూ పాటలు పాడి కంప్యూటర్లలొ రికార్డు చేసుకుంటాం, అది విన్నప్పుడు ఇది నేను పాడానా వాడు పాడాడా అని మేమే తికమక పడుతు ఉంటాం. ఆమ్మా నాన్నల తరువాత అందరికన్నా ఎక్కువగా వాడిని మిస్ అవుతున్నాను.
హ్యుస్టన్ చేరాము, కస్టంస్ కష్టాలు తీరటానికి అరగంట పైనే పట్టింది, అమెరికా చేరగానే ఇక నా సెల్ ఫోను గలగలా మోగటం మొదలుపెట్టింది, అందరూ “వచ్చేశావ… ఎలా జరిగింది ప్రయాణం?” అని అడగటం, నేను “ఇంకొన్ని గంటలు ఆగండర్రా, స్వయంగా మీ ఎదురుగా కూర్చునే చెప్తాను కబుర్లన్నీ” అనటం, ఇది ప్రతి కాల్ సారాంశం. మళ్ళీ నా కనెక్టింగు ఫ్లైటుకి ఇంకా ముప్పావుగంట టైముంది…
ఇంకొక గంట ప్రయాణం తర్వాత మా బుల్లి ఎయిర్పోర్టులో లాండయ్యాను, నన్ను పికప్ చేసుకోవటానికి నా స్నేహితులు వచ్చారు, అప్పటిదాకా ఉన్న అలసట అంతా దూరమైపోయింది… ఇంటికి చేరుకునే అర్ధగంటలో హైదరాబాదు సంగతులు చెప్పుకుంటూ రాత్రి పదింటికి చేరుకున్నాం, చేరగానే నాకోసం మిగతా ఫ్రెండ్సు వండిన వంటకాల రుచి చూసి సర్దుకోవాల్సిన బట్టల్ని, వస్తువుల్ని సూట్కేసుల నుంచి తీసి, పనులు అన్నీ కానిచ్చి మరింకొన్ని కబుర్లు చెప్పుకుని పడుకునేటప్పటికి ఉదయం నాలుగయ్యింది, రెండో రోజు మధ్యాహ్నం వేరే ఎవరో ఒక తెలిసినతనిని ఎయిర్పోర్టు నుండి తీసుకురావాలని గుర్తొచ్చి ఇక పడుకున్నాను, ప్రయాణ బడలిక వల్ల బాగా నిద్రపట్టింది. పొద్దున పదింటికి మెలకువ వచ్చింది, లేచి స్నానం చేసి బయల్దేరాను ఎయిర్పొర్ట్ కి, మా ఫ్రెండు కారు డ్రైవ్ చేసుకుంటూ…
ఇంకో ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్టు కి చేరుకుంటాను అనుకుంటూండగా ఎదురుగా ట్రాఫిక్కు జాం బ్రేకులు పడటంలేదు, పక్కకి తిప్పకపోతే ఎదురుగా ఉన్న కార్లని గుద్దేస్తాను, ఆ క్షణంలొ ఇంకేమీ ఆలోచించకుండా స్టీరింగ్ తిప్పాను నూటనలభై కే ఏం పీ హెచ్ ల స్పీడులొ ఉన్న కారు వెళ్ళి బ్రిడ్జి స్తంబానికి కొట్టుకుంది…..
సశేషం..
Saturday, March 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Greetings from Turkey.Have a nice day.
Post a Comment